ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 హోరాహోరీగా జరుగుతుంది. ఇందులో భాగంగానే చిన్న స్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సిబి జట్టు అతి స్వల్ప పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై సత్తా చాటిన ఆర్సిబి 11 పరుగులు తేడాతో రాయల్స్ పై గెలుపొందింది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సొంత గడ్డపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోగా.. ఒకటి గెలుపొందింది.
మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ సి బి ఓపెనర్లు కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ క్రీజు లోకి వచ్చారు. మొదటినుంచి దూకుడుగా ఆడారు. వరుస పరుగులు రాబట్టి అదరగొట్టేసారు. సూపర్ ఫాం కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసేసరికి 0 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేశారు. వీలైనప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు.
ఇలా నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సిబి జట్టు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు రాబట్టాడు. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, రజిత పాటిదర్ ఒక్క పరుగు, టీమ్ డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేష్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఈ లక్ష్య చేదనకు దిగిన ఆర్ఆర్ జట్టు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. మ్యాచ్ను సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. నిర్దేశించిన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.
14 ఏళ్ల వైభవ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా అదరగొట్టేసారు. వరుసగా ఫోర్లు సిక్స్లు రాబట్టారు. కానీ వైభవ్ ఎక్కువ సమయం క్రీజ్ లో నిలబడలేకపోయాడు. 16 పరుగులకే వెనుతిరిగాడు. కానీ జైస్వాల్ తన దూకుడు ఆపలేదు. సిక్సర్లతో చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ధృవ్ జురెల్ 34 బంతుల్లో 47 పరుగులు చేశాడు. నితీష్ రానా 28 పరుగులు, రియాన్ పరాగ్ 22 పరుగులు, హెట్ మేయర్ 11 పరుగులు, శుభం దుబే 12 పరుగులు చేశారు.