Jail CMs: జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే ఈ ప్రచారం చేస్తున్నారా ?. లేకపోతే కామెడీ చేస్తున్నారా ?
అలా అయితే లైన్లో లక్షల మంది ఉంటారు!
జైలుకు వెళ్లిన వాళ్లందరూ సీఎంలు అవ్వాలంటే.. జైళ్లలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వారంతా అవ్వాలిగా ?. సీఎం రేసులోఉండి పోరాడుతున్న వారిని ప్రజల్లోకి వెళ్లకుండా తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెడితే వారికి అది రాజకీయంగా ప్లస్ అవుతుందని.. ప్రజలు సానుభూతి చూపి గెలిపిస్తారని చెప్పుకుంటారు.దానికి జైలుకెళ్తే సీఎం అనే ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు, రేవంత్, హేమంత్ సోరెన్ లాంటి వాళ్లంతా ఇలా సీఎంలు అయ్యారు. తర్వాత కేజ్రీవాల్ కూడా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లాడు కానీ ప్రజలు ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. ఓడించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత మాత్రమే గెలిపించారు. అందుకే ఆయన విషయంలో జైలు లాజిక్కు పని చేయలేదని అనుకోవచ్చు.
సీఎం అయితే దానికి జైల్ కారణం కాదు !
కక్ష సాధింపుల కారణంగా జైల్లో పెడితే అయ్యో పాపం అని ప్రజలు ఎవరైనా నేతకు ఓట్లు వేస్తే అప్పుడు జైలు కారణంగా సీఎం అయ్యారని అనుకోవచ్చు. అయితే చంద్రబాబునాయుడు కూడా జైల్లో పెట్టడం వల్ల సీఎం కాలేదు. అది కూడా ఓ కారణం అయి ఉండవచ్చు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా కాలం జైల్లో ఉన్న కేజ్రీవాల్ మరోసారి సీఎం అయ్యేందుకు ప్రయత్నించారు. కేజ్రీవాల్ విషయంలో ఈ లాజిక్ పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అసలు రాజకీయాల్లో లేని రాజకీయ కారణాలతో అరెస్టు కాని అల్లు అర్జున్ ఎలా సీఎం అవుతారు?. ప్రడిక్షన్ చేసే వాళ్లకు.. నమ్మేవాళ్లుకు.. ప్రచారం చేసే వాళ్లకూ కనీసం బుర్ర ఉండక్కరలేదా?
జైలుకెళ్తే పరువు తక్కువ – రాజకీయ నేతలకుకాదు!
రాజకీయ నేతలకు సిగ్గూశరం ఉండవు. ఎంత పెద్ద అవినీతి చేసి జైలుకెళ్తే అంత పెద్ద లీడర్ అనుకుంటారు. కానీ అదే అల్లు అర్జున్ లాంటి హీరో జైలుకు వెళ్తే పరువు తక్కువ అనుకుంటారు. అందుకే ఆయన తానేదో వేధింపులకు గురయ్యానని ప్రచారం చేసుకునేందుకు ఓదార్పు కు ఓ రోజు కాల్ షీట్ ఇచ్చేశారు. కానీ ప్రజల్లో అవి నెగెటివిటీ తెస్తుంది. సామాన్యులు, ఇతరులు ఎవరైనా జైలుకు వెళ్తే అది పరువు తక్కువ అవుతుంది. దాని వల్ల సమాజంలో చిన్న చూపులకు గురవ్వాల్సి ఉంటుంది. సీఎం అవుతారని ఎవరైనా అంటే.. కనీసం కౌన్సిలర్లు కూడా కాలేరు. అందుకే ఈ ప్రచారాన్ని సెలబ్రిటీలు కూడా సీరియస్ గా తీసుకోకూడదు.